హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ నిర్వర్తించిన పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. తెలంగాణభవన్‌లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల బాధే తన బాధగా నిర్ణయించుకుని, తెలంగాణ విముక్తి కోసం జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నూటికి నూరు శాతం సిద్ధించి తీరుతుందన్న నమ్మకం ఉంచి, తోడు నీడగా సాగారని, వారిద్దరిది గురు-శిష్యుల బంధమని చెప్పారు. విద్యార్థి దశలో తాను జయశంకర్‌కు శిష్యుడినని గుర్తుచేసుకున్నారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దాష్టీకం మొదలైందని, తిరిగి తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని, అందుకోసం అందరం కంకణబద్ధులం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జయశంకర్ సేవలు మరువలేనివి: పొన్నాల
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ వీసీగా జయశంకర్ నియామకం వెనుక తన పాత్ర కూడా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ కోసం జీవితకాలం కృషి: కొప్పుల
ప్రొఫెసర్ జయశంకర్‌తో తనకు చాలా సంవత్సరాల అనుబంధం ఉన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమవ్యాప్తి కోసం తన జీవితకాలం అంతా కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని అభివర్ణించారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం జయశంకర్ చరిత్ర ఉంటుందని చెప్పారు.
దోపిడీతోనే ఉద్యమం వచ్చింది: ఆర్ఎస్పీ
ఒక పోలీస్ ఆఫీసర్‌గా తనకు జయశంకర్ సార్‌తో అవినాభావ సంబంధం ఉన్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్మరించుకున్నారు. పోలీసు అధికారులకు ఆయనతో ఉపన్యాసం ఇప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తిన్న అన్నం అరగడం కోసం కాదు, తరతరాల దోపిడీ నుంచి మన బిడ్డల్ని రక్షించుకోవడం కోసం తెలంగాణ ఉద్యమం అని సార్ తనతో అన్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, సుమిత్రా ఆనంద్, బొమ్మర రామ్మూర్తి, పల్లె రవికుమార్, కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉదాత్తమైన విలువలకు ప్రతిరూపం: దేశపతి శ్రీనివాస్
తెలంగాణ సంస్కృతిలో ఉన్న ఉదాత్తమైన విలువలకు ఒక వ్యక్తి రూపం వస్తే అది ఆచార్య జయశంకర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభివర్ణించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆధారాలు సహా నిరూపించారని తెలిపారు. 1969 నుంచి జరిగిన అన్ని తెలంగాణ ఉద్యమాల్లో ఆయన భాగస్వామ్యం ఉన్నదని వివరించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ వెన్నంటే నడిచి, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమస్ఫూర్తిని నూరిపోశారని పేర్కొన్నారు. తెలంగాణను యాచించి కాదు అని, శాసించి తెచ్చుకోవాలని చెప్పిన మహానుభావుడని కొనియాడారు.