హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రామాలను దిగ్బంధించి, స్థానికులను అరెస్టు చేసి కంపెనీలు ఎలా పెడుతారని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రశ్నించారు. ఒకవేళ కంపెనీలు పెట్టినా వాటిని నడుపగలరా అని నిలదీశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ సేకరణ అనేది చట్ట పరిధిలో ప్రజల సమ్మతితో జరుగాలని, బలవంతంగా గుంజుకోవాలనుకోవడం తగదని సూచించారు. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల కోసం భూ సేకరణ చేయాల్సి వచ్చినప్పుడు నిరాకరించే హక్కు ప్రజలకు ఉంటుందని గుర్తుచేశారు. లగచర్ల ఘటనలో కుట్ర దాగి ఉన్నదని అధికారులు పేర్కొనడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని తెలిపారు. ఒకవేళ కుట్ర నిజమే అయితే అది భూములను గుంజుకునే కుట్ర అయి ఉండవచ్చని పేర్కొన్నారు. అధికారులు కూడా తాము పెట్టుబడిదారులకు ఏజెంట్లు కాదన్న విషయాన్ని గుర్తెరిగి మెలగాలని కోరారు. అధికారులపై దాడి కూడా సమర్థనీయం కాదని చక్రపాణి వెల్లడించారు.