హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్ బీ డీన్‌కుమార్ నియమితులయ్యారు. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను మరోసారి జేఎన్టీయూకే అప్పగించగా, కన్వీనర్‌గా డీన్‌కుమార్‌కు అవకాశం కల్పించారు. జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో హెచ్వోడీగా పనిచేస్తున్న ఆయనను ఎప్‌సెట్-25 కన్వీనర్‌గా నియమించారు. ఇప్పటికే రెండు సార్లు ఎప్‌సెట్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఆయనకే మూడోసారి కన్వీనర్‌గా బాధ్యతలప్పగించారు. ఎప్‌సెట్‌తోపాటు మరో 6 ప్రవేశ పరీక్షల కన్వీనర్లను, ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మంగళవారం ప్రకటించారు. కాగా ప్రవేశ పరీక్షల కన్వీనర్ల ఎంపికలో ఉన్నత విద్యామండలి అధికారులు పలు జాగ్రత్తలు పాటించారు. గత సంప్రదాయాలను పక్కనబెట్టి.. పాత వారితోపాటు కొత్త వారికి కన్వీనర్ బాధ్యతలప్పగించారు. ఐసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ కన్వీనర్లుగా కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎప్‌సెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్ కన్వీనర్లుగా పాత వారికే అవకాశం ఇచ్చారు. ఇక కన్వీనర్ల నియామకంలో మహిళలకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఇద్దరు మహిళా ప్రొఫెసర్లకు కన్వీనర్ బాధ్యతలప్పగించారు.