హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వరి సేకరణపై శుక్రవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఉన్నతాధికారులు, మిల్లర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. రైతుల ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సన్నరకం వరిపై రైతులందరికీ క్వింటాల్‌కు రూ.500 అదనంగా బోనస్ అందజేయనున్నట్టు ఆయన ప్రకటించారు. మిల్లింగ్ చార్జీలు కూడా సన్నరకంపై రూ.40, ముతక వరికి రూ.30 పెంచినట్టు తెలిపారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా మిల్లర్లతో సమస్యలుంటే వెంటనే పరిషరించాలని అధికారులకు సూచించారు.