హైదరాబాద్, మే12 (నమస్తే తెలంగాణ): బాలికల గురుకులాలు, విద్యాసంస్థల్లో కేవలం మహిళా సిబ్బందినే నియమించాలనేది జీవో 1274 నిర్దేశిస్తున్నది. ఏ సొసైటీలోనూ ఈ జీవో అమలవడం లేదు. ఇటీవల బదిలీలు, ప్రమోషన్ల సమయంలో ఈ జీవోను పూర్తిగా పక్కనబెట్టిన ఎస్సీ గురుకుల సొసైటీ.. ఇప్పుడు అకస్మాత్తుగా, యుద్ధప్రాతిపదికన జీవో అమలుకు పూనుకోవడం విస్మయానికి గురిచేస్తున్నది. అయితే సొసైటీలోని సుమారు 2,000 మంది పార్ట్టైమర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించడమే ఏకైక లక్ష్యంగా దీనిని ముందుకు తెచ్చినట్టు అధికారవర్గాలే తేల్చి చెప్తున్నాయి.
ఏటా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన ప్రొసీడింగ్స్ ఆర్డర్స్‌ను సొసైటీ ఈ ఏడాది ఇప్పటివరకూ ఇవ్వకపోవడం దానికి బలం చేకూరుతున్నది. జీవో సాకుతో ఔట్సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేసేందుకు సొసైటీ ఉన్నతాధికారులు మళ్లీ పావులు కదుపుతున్నారని వివరిస్తున్నారు. ఎస్సీ గురుకులాల తీరే ఇప్పుడు అంతుచిక్కడం లేదు. నిరుడు సెప్టెంబర్‌లో సొసైటీ పరిధిలోని సీవోఈ, ఇతర గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగులందరినీ రాత్రికి రాత్రే సొసైటీ విధుల నుంచి తొలగించింది. మానవ హక్కుల కమిషన్ చొరవ మేరకు వారిని తిరిగి యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది.
గురుకుల సొసైటీలో 4,000 మందికిపైగా పార్ట్‌టైం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. అందులో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, స్టాఫ్‌నర్స్ కలిపి సుమారు 2,000 మందికి పైగా పురుషులే ఉన్నారు. వీరిలో చాలామంది దశాబ్దకాలంగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయ సిబ్బందితో సమాన విధులు నిర్వర్తిస్తున్నారు. జీవో 1274ను సాకుగా చూపుతూ ఆ 2,000 మందిని పూర్తిగా తొలగించేందుకు సొసైటీ పూనుకున్నదని పార్ట్‌టైం సిబ్బంది ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై గురుకుల పార్ట్‌టైమ్ ఉద్యోగుల సంఘం నిప్పులు చెరుగుతున్నది.