నిర్మల్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు సమస్యల సెగ తగులుతున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని చాలా చోట్ల రైతులు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించేది లేదని ప్రకటిస్తుండటం గందరగోళానికి దారితీస్తున్నది. దిలావర్పూర్ మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అక్కడి రైతులు సర్వేను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి దుమారం రేపారు. ఆయా ఘటనలతోపాటు జిల్లావ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా సర్వే కోసం వస్తున్న ఎన్యూమరేటర్లను రైతులతోపాటు స్థానికులు నిలదీస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా సర్వేలో పేర్కొన్న అంశాలపై మెజారిటీ ప్రజలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు. ఆస్తులు, అప్పుల విషయంలో వివరాలు సేకరించడాన్ని వారు తప్పుబడుతున్నారు. తమ ఆస్తులు, అప్పులతో సర్కారుకు సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఎన్యూమరేటర్లపై ఒత్తిడి సరికాదు : టీఆర్టీఎఫ్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : కులగణన సర్వే ఎన్యూమరేటర్లపై టార్గెట్ల పేరిట అధికారులు ఒత్తిడి చేయటం సరికాదని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒక్కో ఇంట్లో సర్వే చేసేందుకు 40 నిమిషాల సమయం పడుతున్నదని, రాత్రి 9గంటలైనా 15 కుటుంబాలను సర్వే చేయలేకపోతున్నారని వాపోయారు. చలికాలం నేపథ్యంలో త్వరగా చీకటి పడుతుండటంతో మహిళా ఎన్యూమరేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలతోపాటు మిగతా శాఖలకు చెందిన ఉద్యోగులను సైతం సర్వేలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు.