సంగారెడ్డి : ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మొదటి నుంచి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న నక్సలైట్ల పేరుతో బయటికి వచ్చిన లేఖ నిజమా…?కాదా అన్నది పక్కన పెడితే సమస్యకు పరిష్కారం చర్చల ద్వారానే అవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. పోతిరెడ్డిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరై మాట్లాడారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపేసి నక్సలైట్లతో చర్చలు జరపాలన్నారు. సెప్టెంబర్ 17న ఉత్సవాలు జరిపే అర్హత కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లేదని పేర్కొన్నారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకం అని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అసలు బీజేపీ పార్టీ లేనేలేదన్నారు. బీజేపీ విమోచనం పేరుతో మోసం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ, నైజాం విధానాలు ఒక్కటే…ఇద్దరు బ్రిటిష్ వారికి ఎజెంట్లుగా పని చేశారని విమర్శించారు. సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజీపీ పార్టీల నుంచి ఒక్కరైనా ఉన్నారా ? అని ప్రశ్నించారు. నాడు నైజాం భూ స్వాములని ప్రోత్సహిస్తే ఇప్పుడు కార్పొరేట్ శక్తుల్ని బిజెపి ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు.