మేడ్చల్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో స్థానికంగా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీనికి తోడు మున్సిపాలిటీలు ఇన్చార్జి అధికారుల పర్యవేక్షణలో ఉండటంతో సమయానికి పనులు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇటీవలే మూడు మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. మున్సిపాలిటీల ఏర్పాటులో ప్రభుత్వానికి ఉన్న ఉత్సాహం అక్కడ ఉన్న ఖాళీలను భర్తీచేయడంలో లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకపోతున్నాయి.
3 మున్సిపాలిటీలకు సంబంధించి మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ముఖ్య పోస్టులైన డీఈ, ఏఈ అధికారులను ఇప్పటికీ భర్తీచేయకపోగా అలియాబాద్‌లో డీఈ ఉద్యోగిని భర్తీచేసి ఏఈ ఉద్యోగిని నియమించలేదు, రెండు మున్సిపాలిటీలకు తూకుంట టౌన్‌ప్లానింగ్ అధికారిని మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలకు ఇన్చార్జిగా నియమించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మూడు మున్సిపాలిటీలకు ఇన్చార్జిగా ఉన్న నేపథ్యంలో విధుల నిర్వహణ ఎలా కొనసాగిస్తాడని వారానికి రెండు రోజులైన మున్సిపాలిటీలకు టౌన్‌ప్లానింగ్ అధికారి రావడం లేదని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ విషయానికి వస్తే మేడ్చల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని ఎల్లంపేట్ మున్సిపాలిటీకి ఇంచార్జి టౌన్ ప్లానింగ్ అధికారిగా నియమించారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ మున్సిపాలిటీల పరిధిలో వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తరచు ఎదైనా పనుల నిమిత్తం వెళ్తే పనులు కావడం లేదని, సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మున్సిపాలిటీలలో ఎదేని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు మంజూరు అయ్యేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసే ఇంజనీరింగ్ విభాగం అధికారులు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలకు ఇప్పటి వరకు ఎలాంటి నిధలు కేటాయించకున్న గ్రామ పంచాయితీలుగా ఉన్న సమయంలో టాక్స్‌ల రూపంలో వచ్చిన నిధుల ద్వారా అయిన అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ఏఈలు లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్ట్టలేకపోతున్నారు. మున్సిపాలిటీలపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న 16 మున్సిపాలిటీలను గ్రేటరలో విలీనం చేస్తారనే ఉద్దేశ్యంతోనే నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జీహెచ్ంఎసీ పాలకవర్గ పదవీకాలం ముగిసిన వెంటనే జిల్లాలో ఉన్న నిజాంపేట్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, బొడుప్పల్ కార్పొరేషన్లతో పాటు మేడ్చల్, గుండ్లపోచంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, తూకుంట, దుండిగల్, కొంపల్లి, మూడుచింతపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీలను గ్రేటర్లో త్వరలో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.