
హైదరాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ ): కొత్త జోన్లు, జిల్లాల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియతో తాజాగా 1,586 మంది ఉద్యోగుల కుటుంబాలను ఎన్నో ఏండ్లుగా పీడిస్తున్న సమస్య పరిష్కారమైంది. తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించడంతో చెరో జిల్లాలో పనిచేస్తున్న దంపతులు ఒకే జిల్లాకు బదిలీ అయ్యారు. ఉద్యోగుల బదిలీలు, కేటాయింపుల ప్రక్రియలో భాగంగా విద్యాశాఖలో స్పౌజ్ కేసుల దరఖాస్తులను బుధవారం పరిష్కరించారు. దంపతులిద్దరూ ఒకే జిల్లాలో ఉండే విధంగా చర్యలు తీసుకొన్నారు. 1,586 మంది జాబితాను విడుదల చేశారు. ఆయా జాబితాలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంతో సుదీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభించడంతో ఆయా కుటుంబాలు సంబురాలు చేసుకొంటున్నాయి.