హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ-ప్రైవేటు ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకలాంటి రియల్, నిర్మాణ రంగం సర్కారు పెద్దలకు పిల్లలాటగా మారిందనేందుకు ఉదాహరణలెన్నో. ఒకవైపు ప్రభుత్వ భూముల్లో వెంచర్లు, నిర్మాణాలకు అనుమతినిస్తూనే, మరోవైపు అక్రమ నిర్మాణాలంటూ ఎడాపెడా కూల్చివేతలు చేపడుతున్న సర్కారు ద్వంద్వ నీతి కొనుగోలుదారులకు సంకటంగా మారింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు మూడు వెంచర్లు, ఆరు అపార్టుమెంట్లు అన్నట్లుగా విరాజిల్లిన ఈ రంగాలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ తప్పటడుగులతో గత 18 నెలలుగా నేలచూపులు చూస్తున్నాయి. ఖాజాగూడలో కొనసాగుతున్న మ్యాన్‌హట్టన్ ప్రాజెక్టు భూమి ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లోనే మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ కొనసాగుతుందన్నారు. కోర్టు ఆదేశానుసారం మరోసారి ఫిర్యాదు చేశామన్న ఆయన, సదరు నిర్మాణ కంపెనీకి నోటీసులు కూడా జారీ అయ్యాయని తెలిపారు.
వచ్చే వారం హైకోర్టులో విచారణకు రానుందని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలం కలిసి ఫిర్యాదులు చేయడంతో పాటు కోర్టులో పిల్ వేశామంటేనే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్టులో ప్లాట్లు కొనుగోలు చేయొద్దని అనిరుధ్ కోరారు. అది ప్రభుత్వ భూమిగా నిర్ధారణ జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, సదరు నిర్మాణ సంస్థ చేతులెత్తేస్తుందని హెచ్చరించారు. చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వదని, అందుకే కొనుగోలుదారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
ఆది నుంచి సర్కారు తీరింతే
కేవలం ఖాజాగూడ అంశంలోనే కాదు, గోపన్పల్లిలోనూ ప్రభుత్వ తీరు ఇట్లనే తయారైంది. గతంలో సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సచివాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి రూ.15 వేల కోట్ల విలువైన 11 నిర్మాణ ప్రాజెక్టులు అక్రమమని తేల్చి చెప్పారు. కానీ ఆ ప్రాజెక్టు పనులను మాత్రం నిలిపివేయలేదు. ఒకవైపు అక్రమమంటూనే, మరోవైపు నిర్మాణాలను అడ్డుకోకుంటే ప్రజలు ఏది నమ్మాలి? కొనాలా, వద్దా అనేది తేల్చుకోలేక కొనుగోళ్లనే వాయిదా వేస్తున్నారు. ఆ పరిణామాలతో రియల్-నిర్మాణ రంగం కుదేలవుతున్నది. మరోవైపు, ప్రభుత్వ భూముల్లో వెలసిన నిర్మాణాలంటూ గతంలో అనుమతులు ఉన్న, హైకోర్టు స్టేటస్ కో ఉన్న నిర్మాణాలను సైతం హైడ్రా క్షణాల్లో కుప్పకూల్చింది. కానీ మ్యాన్‌హట్టన్ ప్రాజెక్టు విషయంలో మాత్రం అది టైటిల్ డిస్ప్యూట్ (యాజమాన్య హక్కు వివాదం) అంటూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. వాస్తవానికి గతంలో కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ అదే ప్రభుత్వ హయాంలో సీసీఎల్ఏ కమిషనర్ వాటిని రద్దు చేసిన విషయాన్ని మాత్రం దాచి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అది ప్రభుత్వ భూమి అని ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నా చర్యలకు మాత్రం అనేకరకాల సాకులు చూపుతున్నారు.
ఇది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నంబరు 27లోని 27.18 ఎకరాల ప్రభుత్వ భూమి. ఒక నిర్మాణ సంస్థ ‘మ్యాన్‌హట్టన్’ పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు టవర్ల పనులు కొనసాగుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి కావడంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హైడ్రా, ఇతర విభాగాలకు ఫిర్యాదు చేశారు. చివరకు హైకోర్టులో పిల్ కూడా వేశారు. అంతజరిగినా ప్రభుత్వం స్పందించ లేదు. అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో పనులు రికాం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన అనిరుధ్‌రెడ్డి తాజాగా గాంధీభవన్ వేదికగా ఓ ప్రకటన చేశారు. ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లు ఎవరూ కొనవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం అన్నిరకాల అనుమతులిచ్చిన ఆ ప్రాజెక్టును.. అధికార పార్టీ ఎమ్మెల్యేనే అక్రమ ప్రాజెక్టు అంటున్నారు. ఇంతకీ అది అక్రమమా? సక్రమమా?
ఇది కూడా శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 36లో వెలసిన అక్రమ లేఅవుట్. గతంలో ఈ ప్రభుత్వ భూమిని తమ ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వమే కేటాయించగా, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించారంటూ ప్రభుత్వ ఉద్యోగులు (భాగ్యనగర్ టీఎన్జీవోలు) నిరసన దీక్షలు చేస్తున్నారు. రంగారెడ్డి కలెక్టర్ బాజాప్తా ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ పంపారు. దీన్ని అడ్డం పెట్టుకొని ప్రైవేటు వ్యక్తులు కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. చివరకు హైకోర్టును ఆశ్రయించగా స్టే వచ్చిందని ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం స్పందించదు. ఈ లేఅవుట్ అక్రమమో, సక్రమమో అధికారులు ప్రకటించరు. మరి ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యుడి పరిస్థితి ఏమిటి?