చిన్నశంకరంపేట/కౌడిపల్లి/పాలకుర్తి, నవంబర్ 3 : ప్రభుత్వం ఇరవై రోజుల కిందట అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. కానీ, ధాన్యం కాంటా వేయడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురు,శుక్రవారాల్లో కరిసిన వానకు వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు ధా న్యాన్ని తెచ్చి రైతులు కాంటాలకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో రైతులు బయట వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు.
వ్యాపారులు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చి ధాన్యం తూకం వేస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట కొనుగోలు కేంద్రంలో శని,ఆదివారాల్లో వ్యాపారులు రెండు లారీల ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించారు. కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామంలో ఆదివారం రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారు. జనగామ జిల్లా శాతాపురంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. అయినా అధికారులు స్పందించటం లేదు.