హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం చట్టం తేవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ టీచర్లను కించపరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం తప్పు అని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై త్వరలోనే లక్ష మందితో భారీ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం వినోద్‌కుమార్ మీడియా సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 40,941 పాఠశాలలుంటే వాటిలో 30,307 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి మొత్తం 59.45 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, సర్కారులో 28.95 లక్షలుంటే, ప్రైవేట్‌లో 30.49 లక్షల మంది చదువుతున్నారని వివరించారు.
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వారే ప్రైవేట్ పాఠశాలల్లో చదువు చెప్తున్నారడనం సరికాదని హితవుపలికారు. విద్యాహకు చట్టం కింద శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉండాలని, చాలా సూళ్లల్లో శిక్షణ పొందిన వారే ఉన్నారని వివరించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేట్ టీచర్లకు సంక్షేమ బోర్డు ఉండాలని ప్రైవేట్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినట్టు గుర్తుచేశారు. విద్యా సెస్సు వసూలు చేసైనా ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంరక్షణ బోర్డు ఉండాలని చెప్పారు. ప్రైవేట్ టీచర్లకు రిటైర్మెంట్ తర్వాత సాయం అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గతంలో మాజీ స్పీకర్ జీ నారాయణరావు చొరవతో న్యాయవాదులకు సంక్షేమ చట్టం వచ్చిందని, అన్ని రాష్ట్రాల్లో ఇది అమలవుతున్నదని, ప్రైవేట్ టీచర్లకు కూడా సంరక్షణ చట్టం రావాల్సిందేనని చెప్పారు.