DEET | హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్)లో నమోదు చేసుకుంటే నిరుద్యోగులు నైపుణ్యాలు, విద్యార్హతలకు అనుగుణంగా ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం, చదువు పూర్తైన అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నది. ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ‘డీట్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని ఈ నెల 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ ప్రారంభించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఇందులో ఉచితంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌తోపాటు మరిన్ని వివరాలకు డీట్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
2 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో సీట్ల భర్తీకి రెండో విడత షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని కన్వీనర్ శ్రీనివాసచారి ప్రకటనలో తెలిపారు. 2 నుంచి 4 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 9న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు 13 వరకు ఫీజు చెల్లించాలని, 16న రిపోర్ట్ చేయాలని సూచించారు.