కోదాడ, అక్టోబర్ 26 : అసెంబ్లీ ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ఆశలను గల్లంతు చేస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా కోదాడలో మీడియాతో మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాతో యువతకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక యువతను మభ్యపెట్టేందుకే ప్రైవేట్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నదని ఆరోపించారు. వంద రోజుల్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అశోక్‌నగర్ చౌరస్తాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా యువత శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం అక్రమ అరెస్టులతో అణచివేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందించడం తప్ప యువతకు ఒరగబెట్టింది ఏమీలేదని పేర్కొన్నారు. ఔట్‌సోర్స్ , కాంట్రాక్టు ఉద్యోగాల ఎంపికలో కాంగ్రెస్ నాయకులు ఏజెన్సీల నుంచి లక్షల సొమ్మును కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. యువత వాస్తవాలను గ్రహించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గెలిచిన తర్వాత మోసం చేసిందని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ పరిధిలోని దివ్యాంగుల సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. పింఛన్ లబ్ధిదారులతో ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నియోజకవర్గంలోని 3,500 మంది దివ్యాంగుల ఓటర్ల వద్దకు సహచర దివ్యాంగులే వెళ్లి.. కేసీఆర్ సర్కార్ చేసిన మంచిని, ప్రయోజనాలను వెల్లడించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్కు అండగా నిలువాలని దివ్యాంగులు నిర్ణయించారు.