హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేటు పెటుబడులు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు (రూ.16,475.90 కోట్లు)గా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో ఏకంగా 40 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్ల (రూ.23,066.26 కోట్ల)కు చేరినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ వెల్లడించింది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం పెట్టుబడులు టాప్-10 లావాదేవీల ద్వారా వచ్చినవేనని తాజా సర్వేలో తేల్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 80 శాతంగా ఉన్న టాప్-10 లావాదేవీల వాటా.. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో ఏకంగా 86 శాతానికి పెరిగినట్టు స్పష్టం చేసింది.
అనరాక్ సర్వే నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఢిల్లీలో అత్యధికంగా 60% వృద్ధి నమోదైంది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో అక్కడ మొత్తంగా 942 మిలియన్ డాలర్ల (రూ.7,782 కోట్ల) లావాదేవీలు జరిగాయి. బ్రూక్ఫీల్డ్, భారతీ ఎంటర్ప్రైజెస్, బెయిన్ క్యాపిటల్, టార్క్ తదితర సంస్థల జాయింట్ వెంచర్ల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి. దేశవ్యాప్తంగా జరిగిన టాప్-5 లావాదేవీల్లో హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్అండ్టీ కంపెనీ ఇటీవల కెనడా సంస్థ బూక్ఫ్రీల్డ్తో కుదుర్చుకొన్న డీల్ నాలుగో స్థానంలో నిలిచింది.
మెట్రోరైల్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం నుంచి ఎల్అండ్టీ లీజుకు తీసుకొన్న భూముల్లో 15 ఎకరాలను సబ్ లీజుపై బ్రూక్ఫీల్డ్కు ఇచ్చింది. ఈ డీల్ విలువ 129 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,100 కోట్లు). హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులు భారీగానే పెరుగుతున్నట్టు ఈ డీల్ రుజువు చేస్తున్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.