రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా పనులు చేస్తూ.. లేఅవుట్‌ను ఆక్రమించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. బుధవారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు రాత్రి కూడా అక్కడే నిద్రపోయారు. బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది నిరసన ప్రదర్శన, వంటావార్పు నిర్వహించారు.
న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ఆక్రమణలు తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే 4వేల మంది ఉద్యోగులతో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రైవేటు వ్యక్తుల కబ్జాలను తొలగించాలని, అక్కడ పనులను నిలిపివేయాలని, తమ భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.