Private Colleges | జగిత్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు ఆగస్టులో రూ.500 కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. ఫలితంగా పలు కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారి మూతదశకు చేరుకుంటున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 890 ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా కాలేజీల్లో దాదాపు 1.50 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఒకప్పుడు 1,200కు పైగా ఉన్న కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అందక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక కాలేజీలను మూసివేశారు. దీంతో కాలేజీల సంఖ్య తగ్గిపోతూ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కళాశాలలకు అరకొర నిధులు ఇవ్వడంతో పెద్దఎత్తున బకాయిలు ఏర్పడ్డాయి. 2014లో రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పడ్డాయి. వీటిని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది.
2023 ఆగస్టులో కేసీఆర్ సర్కార్ ఫీజు రీ యింబర్స్మెంట్కు రూ.500 కోట్లు మంజూరు చేసింది. నిధులు కాలేజీల ఖాతాల్లోకి జమ అవుతాయన్న టైంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నిధులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం కొత్తగా నిధులు విడుదల చేయకపోగా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ను విడుదల చేయలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఎంని కలిసేందుకు ప్రయత్నించినా కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం నేతలు నిరసిస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరుకాక ప్రైవేట్ కాలేజీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు పూర్తిగా రీయింబర్స్మెంట్పైనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. సిబ్బంది వేతనాలు, భవనాల అద్దె, కరెంట్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. వడ్డీలు పెరిగిపోయి నానా బాధలు పడుతున్నాం. ప్రస్తుతం ఒక్కో కాలేజీకి కోట్లలో ప్రభుత్వం బకాయి ఉంది.
– యాద రామకృష్ణ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీల మూసివేత కొనసాగుతున్నది. ఏడేండ్లల్లో 250కి పైగా కాలేజీలు మూతపడ్డాయి. 2017లో ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య 348 ఉండగా, నిరుటి వరకు వీటి సంఖ్య 273కు చేరింది. మేనేజ్మెంట్ కాలేజీలు గతంలో 393 ఉండగా, ఇప్పుడు 314కు పడిపోయింది. గతంలో 78 ఎంసీఏ కాలేజీలు ఉండగా, ఇప్పుడు 65కి చేరింది. ఇలా పలు ప్రొఫెషనల్ కాలేజీలు మూసివేత దిశగా సాగుతున్నాయి. కాలేజీలు అవసరమా.. లేదా? అని చూడకుండా ఇష్టారీతిన ఇబ్బడి ముబ్బడిగా అనుమతులివ్వడమే ఇందుకు కారణంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండటంతో యాజమాన్యాలు సైతం ఇష్టారీతిన కాలేజీలను ఏర్పాటు చేశారు. తీరా చూస్తే కాలేజీలు అధికంగా ఉండటం, విద్యార్థులు చేరకపోవడం, సీట్లు ఖాళీగా ఉండటంతో మూసివేత దిశగా పయనిస్తున్నాయి. కాగా, కొత్త కాలేజీలు సైతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. 2017 -18లో 5, 2018 -19లో 11, 2019 -20లో 5, 2020 -21లో 8, 2021 -22లో 9, 2022 -23లో 2 చొప్పున కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయి. మూతబడుతున్న వాటితో పోల్చితే కొత్తగా ఏర్పాటవుతున్నవి నామమాత్రమే కావడం గమనార్హం.
ఏఐసీటీఈ అనుమతి పొందిన కాలేజీలు (ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ సహా)