హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువలపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. జలసౌధలో నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్తు అవసరాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల అవకాశాలు పరిశీలించాలని తెలిపారు. కాలువలపై బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బూట్) నమూనా ప్రాజెక్టును అధికారులు వివరించారు.
కామారెడ్డి జిల్లాలోని జకోరా-చందోరా మధ్య 15
కి.మీ కాలువపై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా 20 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని, సంవత్సరానికి 340 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు.
కేంద్రం తీరుతోనే అన్యాయం
రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం కేంద్రం కొనుగోలు చేయకుం డా, ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నదని ఉత్తమ్ మండిపడ్డారు. మంగళవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాసంగిలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా 141 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్టు తెలిపారు. కేంద్రం 52 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 75 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని తెలిపారు.