హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): వైదిక ధర్మాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. గొప్ప దైవభక్తుడు, ధార్మిక సేవా తత్పరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని వనస్థలిపురం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న తెలంగాణ వేదవిద్వాన్ మహాసభలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. దేవాలయ అర్చకులు, సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తున్నట్టు చెప్పారు. తమ జీవితాలను వేద ధర్మానికే అంకితం చేస్తున్న ఎందరో విద్వాన్మూర్తులు రాష్ట్రంలో ఉన్నారని, వారికి దేవాదాయశాఖ సముచిత ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. బ్రాహ్మ ణ సంక్షేమ పరిషత్ ద్వారా వేద పండితులకు భృతి, వేద పాఠశాలలకు గ్రాంట్, వేద విద్యార్థులకు పారితోషకాలు అందజేస్తున్నట్టు వివరించారు. వేదాల పరిరక్షణ, వేద ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో జనార్దనానంద సంస్కృతి ట్రస్ట్ చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రముఖులు సాయినాథశర్మ, బ్రహ్మానందశర్మ, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.