హైదరాబాద్ : పీఈటీలకు క్రీడా పాలసీలో ప్రాధాన్యత కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలసి నిరుద్యోగుల కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన కొలువుల జాతరలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొంధిస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర పీఈటీల అసోసియేషన్ అధ్యక్షుడిగా డా. రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పొన్నగాని కృష్ణమూర్తి గౌడ్‌ను మంత్రి అభినందించారు.
కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. సోమేశ్వర్ రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.