అధికారులకు కొత్త పీసీసీఎఫ్ డోబ్రియల్ సూచన
హైదరాబాద్, మార్చి 5 : అడవుల రక్షణ, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు నూతన పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) ఆర్ఎం డోబ్రియల్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నినాదమైన ‘జంగల్ బచావో, జంగల్ బఢావో’ ప్రతి ఉద్యోగి జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయి అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అడవుల రక్షణ, పునరుద్ధరణ, హరితహారంతోపాటు అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు నాణ్యమైన మొక్కలను అందించడం, వన్యప్రాణుల సంరక్షణ, ఎకో టూరిజం, ఆగ్రో ఫారెస్ట్రీ, సాంకేతికత వినియోగం లాంటి అంశాలను ప్రాధాన్యాలుగా పెట్టుకొని పనిచేయాలని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. సమావేశంలో లోకేశ్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, తదిరులు పాల్గొన్నారు.