(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): మా సమస్యలు పరిష్కరించాలంటూ మొరపెట్టుకునే ప్రజల ధాటికి తట్టుకోలేక ఒక్కో వ్యక్తి చేసే ఫిర్యాదుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నియంత్రించింది. ప్రధాన మంత్రి కార్యాలయ పోర్టల్ (సీపీజీఆర్ఏఎంఎస్)లో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవచ్చు. అయితే ధరల పెరుగుదల, పింఛను మంజూరులో జాప్యం తదితర అంశాలపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని విసుగుచెందిన అధికారులు ఒక్కో వ్యక్తి నెలకు 10 ఫిర్యాదులే చేయాలని పరిమితులు విధించారు.
వేలల్లో ఫిర్యాదులు…
మహారాష్ట్రకు చెందిన జయేష్ కులకర్ణి ధరల పెరుగుదలపై ఏడాది కాలంలో 5,426 ఫిర్యాదులు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు ఆనంద్ ఠాకూర్ ప్రైవేట్ రవాణా సంస్థతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని 37,315 సార్లు ఫిర్యాదు చేశారు. రిటైర్డ్ ఉద్యోగి అతిన్మైతీ పింఛను కోసం 16,199 సార్లు, విదేశీ చదువుల నిమిత్తం న్యూజిలాండ్ సంస్థకు రూ.5 లక్షలు ఇచ్చి మోసపోయానని తెలంగాణ యువకుడు డీ శ్రీకాంత్‌రావు పలుమార్లు పోర్టల్‌ను ఆశ్రయించారు. సమస్యలను పరిష్కరించకపోగా పరిమితులు విధించడంపై సామాన్యులు మండిపడుతున్నారు.