కరీంనగర్ ప్రతినిధి, నవంబర్ 12: రామగుండంలో శనివారం నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ సభ అట్టర్ ప్లాప్ అయింది. జనం లేక పలు గ్యాలరీలు వెలవెలబోయాయి. హడావిడిగా నింపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. బీజేపీ నాయకులు జన సమీకరణ కోసం ప్రయత్నం చేసినా మోదీ సభకు రావడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు మరోసారి ధికార స్వరాన్ని వినిపించారు. నిజానికి ఎన్టీపీసీలోని మైదానంలో ఏర్పాటుచేసిన సభకు 50వేల మంది హాజరవుతారని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకొన్నారు. వేల మంది రైతులతో సమావేశం ఉంటుందని రెండుమూడు రోజులుగా ఊదరగొట్టారు. తీరా మైదానంలో చూస్తే సగానికి ఎకువగా ప్రాంతాన్ని హెలికాప్టర్లు, ఇతర సౌకర్యాల కోసం వినియోగించారు. ఇది పోను ఒక షెడ్డు ఏర్పాటు చేసి అందులో భారీగా కుర్చీల వరకు ఏర్పాటు చేశారు. ఆ కుర్చీలు సైతం నిండలేదు. నిజానికి ప్రధాని మోదీ ముందు రైతులను తీసుకొచ్చి ప్రదర్శన చేయాలని ప్రయత్నం చేసినా, మోదీ సభకు రావటానికి రైతులు ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు రామగుండం పారిశ్రామిక ప్రాంతమైన సింగరేణి నుంచి కార్మికులను తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే కార్మికులు మోదీ రాకను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుండటంతో ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అప్పటికప్పుడు ఎన్టీపీసీలోని కొన్ని కుటుంబాలు, యువకులు, విద్యార్థులు, చిన్నారులను తీసుకొచ్చి గ్యాలరీలు నింపే ప్రయత్నం చేశారు. దీంతో చాలా గ్యాలరీల్లో 19 ఏండ్ల వయస్సు వారే అత్యధికంగా కనిపించారు. ఇంత చేసినా ఆరు గ్యాలరీలలో జనం పల్చగా కనబడగా.. రెండు గ్యాలరీలు మాత్రం పూర్తి ఖాళీగానే దర్శనమిచ్చాయి. పదివేల వరకు కుర్చీలు వేసినప్పటికీ ఆరేడు వేల మందికి మించి రాలేదని పరిశీలకులు చెప్తున్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే పలు గ్యాలరీల నుంచి ప్రజలు వెళ్లిపోయారు. ఈ వైఫల్యానికి మీరంటే.. మీరే కారణమని బీజేపీ నాయకుల పరస్పరం నిందలు వేసుకొంటున్నట్టు సమాచారం.
సభకు తీసుకెళ్లి పైసలియ్యలేదు: హాజరైన జనం ఆందోళన
మోదీ సభకు వస్తే ఒక్కొక్కరికి రూ.500, భోజనం పెట్టిస్తామని నమ్మించి రూపాయి కూడా ఇవ్వలేదని సభకు హాజరైన ప్రజలు మంచిర్యాలలో ఆందోళనకు దిగారు. డబ్బులు కాదుకదా పచ్చి మంచినీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మోదీ సభ కోసం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామం నుంచి 300 మందిని తరలించారు. డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకువెళ్లారని, తిరిగి మంచిర్యాల చేరుకున్నాక ఇవ్వలేదని స్థానిక బొమ్మరిల్లు హోటల్ సమీపంలో ధర్నాకు దిగారు. డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని భీష్మించారు. తిండి పెట్టించడంతోపాటు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో బీజేపీ నేత హేమాజీ అక్కడే ఉన్నారు. ఆందోళన చేస్తున్నవారిని బుబ్జగించి కొంత మొత్తం ఫోన్ పే, గూగుల్ పే చేశారు. మిగిలిన డబ్బులు ఆదివారం ఇస్తామని చెప్పి పంపించారు.