Mid Day Meals | కౌడిపల్లి, నవంబర్ 7: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగసానిపల్లి ప్రాథమిక పాఠశాలలో గత ఐదు నెలలుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు మొత్తం 54 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్న భోజనం అందడం లేదు. గిట్టుబాటు కావడం లేదని మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు వంట చేయడం ఆపేశారు.
అప్పటి నుంచి గ్రామంలో పలువురితో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్సులు తెచ్చుకొని తింటున్నారు. అక్షయపాత్ర ద్వారా అందించాలని తీర్మానం చేసినా ఫలితం లేకపోయింది. ఎంఈవో బాలరాజును వివరణ కోరగా.. ఈ సమస్య ఇప్పటిది కాదని, ఈ ఏడాది స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.