Egg Rate | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెకి కూర్చున్నాయి. కార్తిక మాసం ముగిసిన తర్వాత గుడ్ల వినియోగం విపరీతంగా పెరగటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. గత నెలలో ఒకో గుడ్డు ధర రూ.5.50 ఉండగా, వారం క్రితం రూ.6కు చేరుకున్నది. తాజాగా రూ.7 నుంచి 8గా పలుకుతున్నది.
వారం రోజులుగా అధిక ధర
వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర రూ.72 నుంచి ఏకంగా రూ.84కు చేరటం గమనార్హం. హోల్సేల్లో గుడ్డు ధర రూ.5.76 ఉండగా, రిటైల్లో రూ.7కు అమ్ముతున్నారు. కొన్ని వీధుల్లో రూ.7.50, రూ.8కూ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ట్రే (30 గుడ్లు) ధర రూ.180 నుంచి రూ.200 కాగా, రిటైల్ మారెట్లో రూ.7 నుంచి రూ.8కి అమ్ముతున్నారు.
పెరిగిన చలి.. తగ్గిన ఉత్పత్తి
రాష్ట్రంలో 1,100 కోళ్ల ఫారాలు ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణది మూడో స్థానం. రాష్ట్రంలో ఏటా 17.67 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. గత 20 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. కోళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడి గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గింది. క్వింటాలు సోయాచెక దాణా ధర ఏడాది క్రితం రూ.5 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.7,200, మొకజొన్న క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు పెరిగింది. వాహనదారులు రవాణా చార్జీలు 15 శాతం పెంచడం గుడ్ల ధర పెరగడానికి కారణమని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్లో రోజుకు కోటి కోడిగుడ్ల విక్రయం
హైదరాబాద్లో సాధారణంగా రోజుకు 80 లక్షలు, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో 60 లక్షల వరకు కోడిగుడ్లు అమ్ముడుపోతుంటాయి. వారం రోజుల నుంచి ఇతర జిల్లాల్లో 70 లక్షల వరకు గుడ్లు అమ్ముడుపోగా, హైదరాబాద్ నగరంలో కోటి దాటాయి. కరోనా కేసులు, చలి తీవ్రతతో ప్రొటీన్ వినియోగం పెరిగిన దరిమిలా కోడిగుడ్ల ధరల పెరిగాయని వ్యాపారులు భావిస్తున్నారు.