వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 13: బంగారం, వెండి ఆభరణాల కోసం మాత్రమే కొనుగోలు చేసే వారు కొందరైతే, వ్యాపార నిమిత్తం కొనుగోళ్లు చేసే వారు చాలా మందే ఉన్నారు. మార్కెట్ ధరలను బట్టి అమ్మకాలు, కొనుగోళ్లు చేపడుతుంటారు. మూడు నెలల క్రితం జూలై మొదటి వారంలో రూ.లక్షా06వేలు పలికిన కిలో వెండి ధర ఇప్పుడు సెప్టెంబర్ 12న రూ.లక్షా 31వేలు పలుకుతున్నది. గడిచిన వంద రోజుల్లో ధర పెరుగదలలో స్థిరత్వం పాటించడం వల్ల ప్రజల్లో బంగారం కన్నా వెండి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నట్లు అర్ధమవుతున్నది. బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో వ్యాపారులు సైతం బంగారం కొనుగోళ్లు, అమ్మకాల విషయంకంటే వెండిపైనే దృష్టి పెడుతున్నారు.
భారతదేశ ఆర్థిక రంగంలో బంగారం తర్వాత అంతటి విలువ కలిగిన లోహం వెండి. మధ్యతరగతి కుటుంబాల్లో రిజర్వు నిధిగా భావించే బంగారం ధర లు కొండెక్కడంతో సామాన్యుల చేతికి అందకుండాపోయింది. దీంతో పొదుపరుల చూపు వెండిపై పడింది. తక్కువ ధరతో ఎక్కువ లాభాలను ఆర్జించడానికి సులువైన మార్గంగా మారిపోయింది. దేశ వ్యాప్తంగాఉన్న ప్రధాన నగరాలతోపాటుగా వరంగల్ నగరంలో వెండి అమ్మకాల జోరు పెరిగింది. బంగారు ఆభరణాల స్థానంలో వెండి వస్తువుల అమ్మకాలు పెరిగాయి.
వరంగల్ మార్కెట్లో వెండి స్థానం చిన్నదేమి కాదు.. నిత్యం వరంగల్ నగరంలో జరుగుతున్న బులియన్ మార్కెట్లో సుమారు 100 కిలోలకు పైగా ముడి వెండి అమ్మకాలు జరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వరగంల్ నగరానికి ముఖ్యంగా ముడివెండి హైదరాబాద్, ముంబై మహా నగరాల నుంచి సరఫరా జరుగుతూ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన మండలస్థాయి వ్యాపారులు వరంగల్ బులియన్ మార్కెట్ నుంచే వెండి కొనుగోళ్లు చేపడుతుంటారు.