
మద్దిరాల, ఆగస్టు 21: ఆ రైతుకు ఒకేచోట 9ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా పంటలు పండించేందుకు నీళ్లు లేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. మంచినీళ్లు కూడా దొరక్క పక్కవారి బోర్ల నుంచి తెచ్చుకున్నాడు. 11 బోర్లు వేసినా.. ఒక్కదాంట్లోనూ నీళ్లు పడలేదు. దీంతో సాగు మీద ఆశలు వదులుకొని గొర్లు కొనుక్కొని వాటిపైనే ఆధారపడి జీవనం సాగించాడు. ఇది గతం.. ఇప్పుడా పరిస్థితి మారింది. గోదావరి జలాల రాకతో ప్రస్తుతం ఏడు ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో మూడు రకాల పంటలు పండిస్తున్నాడు సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన భూతం లింగయ్య.
రెండేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం కాల్వల ద్వారా గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపడంతో భూగర్భ జలాలు వృద్ధిచెందాయి. దీంతో రైతు లింగయ్య చివరి ప్రయత్నంగా మరో బోరు వేశాడు. అందులో నీళ్లు పుష్కలంగా పడటంతో తిరిగి సాగు బాట పట్టాడు. ఆ బోరు నీటితో రెండెకరాలు, కాల్వల ద్వారా వచ్చే గోదావరి జలాలతో మరో ఐదెకరాల్లో వరి వేశాడు. ఒకప్పుడు తాగడానికి మంచినీళ్లు దొరకని స్థితి నుంచి ఇప్పుడు ఏడెకరాలు వరి సాగు చేస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది. ఇదంతా కాల్వ నీళ్ల పుణ్యమని అక్కడి రైతులు పేర్కొంటున్నారు. గతేడాది ఏడు ఎకరాల్లో వరి, రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. ఈ ఏడాది అంతే మొత్తంలో వరి సాగు, ఎకరంలో పెసర్లు, మరో ఎకరంలో మిర్చి వేయడానికి లింగయ్య సిద్ధం చేసుకున్నాడు. ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ఆయిల్‌పామ్, పొద్దుతిరుగుడు సాగుపై ఆలోచన చేస్తున్నట్టు సదరు రైతు తెలిపాడు. రైతుబంధు పథకం ద్వారా ఏటా పంటసాయం అందుతున్నదని, ఆ డబ్బుతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేవని సంతోషం వ్యక్తం చేశాడు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసిందని, పంట రుణం కూడా లక్ష రూపాయల వరకు మాఫీ అవుతుందని చెప్పాడు. రెండు పంటలు బాగా పండటంతో గతంలో బోర్లు వేయడానికి చేసిన అప్పులు ఇప్పుడిప్పుడే తీరుతున్నాయని రైతు లింగయ్య ఆనందం వ్యక్తం చేశాడు.