Arrests | కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అరాచకపర్వానికి తెరలేపింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేస్తోంది. ప్రజలకు మధ్యకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. నిరసనలకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి గొంతులు నొక్కే చర్యలకు దిగింది.

Padma Rao
సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావును సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు.

Manne Krishank Ci Anuradha
కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు పోలీసులు వెళ్లి గృహనిర్బంధాలు, అరెస్టులు చేపట్టారు. బోయినపల్లిలో మార్కెట్ మాజీ చైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్‌ను గృహనిర్బంధం చేశారు. ఐదో వార్డులో ఉద్యమకారుడు రావుల సతీష్‌తో పాటు మరో నలుగురు కార్యకర్తలను కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఇంటికి బోయినపల్లి పోలీసులు వెళ్లారు. ఆయన అప్పటికే బయటకు వెళ్లడంతో పోలీసులు ఇంటి వద్దే కాపలా ఉన్నారు. బోర్డు మాజీ సభ్యుడు కే. పాండు యాదవ్‌ను మర్రి రామ్‌రెడ్డి కాలనీలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఇంటికి ఉదయాన్నే కార్ఖానా సీఐ అనురాధ వెళ్లారు. క్రిశాంక్ ఇంట్లో లేని సమయంలో కుటుంబ సభ్యులతో సీఐ వాగ్వాదానికి దిగిన దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. ఇంట్లో చిన్నపాప ఉందని, తన భర్త ఇంట్లో లేరని క్రిశాంక్ సతీమణి సుహాసిని చెప్పినా.. ఇంట్లోకి వస్తానంటూ సీఐ వాగ్వాదానికి దిగారు. లోపలేస్తా నా కొడకా.. తమషా చేస్తున్నారా అంటూ పనివాళ్లపై బూతులతో రెచ్చిపోయారు. అనంతరం మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rtc Employees
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న ఉద్యోగులను హనుమకొండలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో పీఎస్ రెడ్డిని, మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో సత్యపాల్‌ను అరెస్టు చేశారు. హనుమకొండలో వెంకటయ్య, సాయిలు, మహేందర్, సోమయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హనుమకొండ బస్టాండ్‌లో హైదరాబాద్ వెళ్లే వారిని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన ఎం.వి. గౌడ్ (డిప్యూటీ జనరల్ సెక్రటరీ), ఎస్.డి. బావొద్దీన్ (ప్రెసిడెంట్), కేఆర్ చందర్ (కార్యదర్శి), పి. జయరాములు (జాయింట్ సెక్రటరీ)లను కామారెడ్డి ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Gajwel
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోనూ రాజకీయ వేడి కొనసాగుతోంది. మార్కుక్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టనున్న రైతు దీక్ష నేపథ్యంలో పలువురు ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రైతుల సమస్యలపై శాంతియుతంగా చేపట్టే దీక్షను అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా గజ్వేల్ నియోజకవర్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎర్రవల్లిలోని ఫంక్షన్హాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్ నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు.

Makthal
మక్తల్‌లో బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మక్తల్ సీఐ రామ్‌లాల్, ఎస్సై రాజు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయినా 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయడం అణచివేత చర్యగా ఆయన పేర్కొన్నారు. పోలీసు అరెస్టులతో బీఆర్ఎస్ ఉద్యమాలను ఆపలేరని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Dharmaram Police
అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పలువురు ఉపసర్పంచ్‌లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న మహా ఉద్యమం నేపథ్యంలో రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల తిరుపతి యాదవ్‌ను కూడా ధర్మారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ముందస్తు అరెస్టులు కొనసాగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తారనే ఉద్దేశంతో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో బీఆర్ఎస్ నాయకులు, ఆశా కార్యకర్తలను ఉదయమే పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.

Karimnagar
కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఉదయమే ముందస్తుగా అరెస్టు చేశారు. టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Yadadri
యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా ఉదయం నుంచే పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.
అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వారిపై బీఎన్ఎస్ 352, 3(5)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.