హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): రాబోయే మూడు నెలల్లో వానకాలం సాగు ప్రారంభమవుతున్నందున ఎరువుల కొరత నివారణపై దృష్టిపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరారు. శుక్రవారం రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. యూరియా తయారీకి అవసరమైన గ్యాస్ కోసం మన దేశం 90% విదేశాలపై ఆధారపడుతున్నదని గుర్తుచేశారు. గల్ఫ్ దేశాల్లోని ఉద్రిక్తతలతో సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
గత సంవత్సరం తెలంగాణలో యూరియా కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు, రైతులపై లాఠీచార్జి ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో యూరియా పంపిణీపై రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. సేంద్రియ ఎరువులు-మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పట్టణాల్లో ఏటా ఉత్పత్తి అయ్యే 30 మిలియన్ టన్నుల తడి వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి సేంద్రియ ఎరువులుగా మార్చాలని, యూపీఐ తరహాలో ఒక విప్లవాత్మక మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తిచేశారు.
ఎన్నికల హామీలకు చట్టబద్ధత కల్పించాలి
జవాబుదారీతనం పెంపొందించేందుకు ఎన్నికల హామీలను చట్టబద్ధం చేయాలని కేంద్రానికి కేఆర్ సురేశ్‌రెడ్డి సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ ప్రవేశపెట్టిన బిల్లును ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య పటిష్టానికి ఇలాంటి చట్టం అవసరమన్నారు. యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ కార్మికుల భద్రత, సంక్షేమంపై దృష్టిపెట్టాలని కోరారు. అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని, ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకొనేందుకు కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తిచేశారు.