హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ బీహార్ రాజధాని పాట్నాలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నేతృత్వంలోని బృందం హాజరైంది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాల ప్రిసైడింగ్ ఆఫీసర్లు హాజరైన ఈ సదస్సులో చట్టసభల నిర్వహణ, సభ్యుల గౌరవం, ప్రజాస్వామ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
సాగుకు అనువుగాని భూములు గుర్తించండి ; అధికారులకు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సాగుకు అనువుగాని భూములను గుర్తించి గ్రామసభల్లో వివరాలు అందుబాటులో ఉంచాలని జిల్లా అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం రైతుభరోసా సర్వేపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేరిన పట్టాదారుల బ్యాంకు వివరాలను ఏఈవోల ద్వారా నమోదు చేయించాలని సూచించారు. రైతుల వద్ద మిగిలిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఇతర పంటలకు కూడా మద్దతు ధర ఇచ్చేలా చూడాలని సూచించారు. ఫిర్యాదుల విభాగానికి అందే సమస్యలను సకాలంలో పరిష్కరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.