హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మాదాపూర్ సీసీఎస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ చదువు యాదయ్యను భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ) అవార్డుతో గౌరవించింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ బుధవారం తన కార్యాలయంలో పీఎంజీ మెడల్ పొందిన యాదయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ ఏడాది దేశంలోనే ఈ అత్యున్నత పురసారాన్ని అందుకున్న ఏకైక వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ యాదయ్య కావడం తెలంగాణ పోలీసులకు గర్వకారణమని కొనియాడారు. పీఎంఎస్ మెడల్ అందుకోబోతున్న ఏడీజీ సంజయ్‌కుమార్ జైన్‌ను సైతం డీజీపీ అభినందించారు.
పోలీసు, ఫైర్, హోంగార్డ్స్ వంటి విభాగాల్లో తెలంగాణకు మొత్తం 29 మెడల్స్ వచ్చాయి. వీటిల్లో తెలంగాణకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ 1, మెడల్ ఫర్ గ్యాలెంట్రీ పోలీసు సర్వీసులో 7, ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ 3, (పోలీసు 2, ఫైర్ 1), మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ 18 (పోలీసు 11, ఫైర్ 2, హోంగార్డ్స్ 5) వచ్చాయి. దేశవ్యాప్తంగా ఒక పీజీఎం, 213 గ్యాలెంట్రీ మెడల్స్, 94 పీఎస్ఎం, 729 ఎంఎస్ఎం మెడల్స్‌ను పోలీసు, ఫైర్, హోంగార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌లో ప్రకటించారు. తెలంగాణలో ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (పీఎస్ఎం) అందుకునే వారిలో టీజీఎస్పీ ఏడీజీ సంజయ్‌కుమార్ జైన్, డీసీపీ కటకం మురళీధర్, అగ్నిమాపకశాఖ డ్రైవర్ ఆపరేటర్ కందిమళ్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. గ్యాలెంట్రీ మెడల్ పొందిన వారిలో ఖమ్మం కమిషనర్ సునీల్ దత్ ఐపీఎస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మోర కుమార్, ఆర్ఎస్ఐ శనిగరపు సంతోష్, కానిస్టేబుళ్లు అమిలి సురేశ్, వేముల వంశీ, కాంపాటి ఉపేందర్, పాయం రమేశ్ ఉన్నారు.
మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ మెడల్స్..
మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్ మెడల్స్ అందుకునే వారిలో పోలీసుశాఖ నుంచి సైబరాబాద్ సీపీ అవినాశ్ మొహంతి, కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా, ఏఎస్పీ పీ కృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ నూతలపాటి జ్ఞానసుందరి, ఎస్సైలు కొమరబత్తిని రాము, అబ్దుల్ రఫీక్, ఇక్రం ఏబీ ఖాన్, శ్రీనివాస మిశ్రా, కుంచాల బాలా కాశయ్య, ఏఎస్సైలు ఏ లక్ష్మయ్య, గుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. అగ్నిమాపకశాఖ విభాగంలో లీడింగ్ ఫైర్మెన్లు తెలుగు మాధవరావు, వహీదుద్దీన్ మహ్మద్ ఉన్నారు. హోంగార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ నుంచి హోంగార్డులు బందోళ్ల లక్ష్మి, మేడిపల్లి మల్లేశ్, ఇంటూరి కవిత, నామాల గాలయ్య, ఇనుముల సుమలత ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను సన్మానించిన కార్యక్రమంలో ఏడీజీలు సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, ఐజీ ఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బందికి పోలీస్ మెడల్స్
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన ఇద్దరు సిబ్బంది విశిష్ట సేవలకు గాను పోలీస్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. మెడల్స్ అందుకునే వారిలో హైదరాబాద్ డివిజనల్ రైల్వేకు చెందిన కామారెడ్డి ఆర్పీఎఫ్ (ఏఎస్ఐ) జే సుధాకర్, విజయవాడ డివిజనల్‌కు చెందిన ఏఎస్ఐ నయింబాషా షేక్ ఉన్నారు.
ఇదీ యాదయ్య వీరోచిత గాథ..
అది.. 2022 జూలై 25. మాదాపూర్ జోన్లో సాయంత్రం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న కే కాత్యాయని అనే 72 ఏండ్ల మహిళ మెడలోంచి బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కాత్యాయని స్థానిక సీసీఎస్‌లో చైన్ స్నాచింగ్ జరిగినట్టు ఫిర్యాదు చేసింది. వారిని పట్టుకోవాలనే ఉద్దేశంతో సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ చదువు యాదయ్య తోటి కానిస్టేబుళ్లు ఎం రవి, ఏ దేభాశ్ సహకారంతో సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. కాత్యాయని చెప్పిన గుర్తుల ఆధారంగా మరుసటి రోజు (2022, జూలై 26)న బొల్లారం క్రాస్‌రోడ్డు వద్ద కానిస్టేబుల్ ఎం కృష్ణ వారి జాడ కనుగొని వెంటనే యాదయ్య టీమ్‌కు సమాచారం ఇచ్చాడు. నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న యాదయ్య బృందం చైన్‌స్నాచింగ్‌లో కరుడుగట్టిన ఇషాన్ నిరంజన్, రాహుల్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నేరస్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో యాదయ్య ఛాతి, వీపు, చెయ్యి, కడుపు భాగాల్లో అనేకచోట్ల గాయాలైనా సర్వశక్తులూ ఒడ్డి పట్టుకున్నాడు. ‘యాదయ్య అచంచలమైన స్ఫూర్తి, విధి నిర్వహణ ప్రతిపోలీసుకు ఆదర్శం’ అని డీజీపీ జితేందర్ కొనియాడారు.