హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లాంటి నేత నాయకత్వం అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా స్పష్టంచేశారు. ప్రజల గురించి ఆలోచించే, మంచి విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ తన విజన్‌ను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు నడిపేందుకు కేసీఆర్ తనవంతు కృషి చేస్తున్నారని, ఆయనతో కలిసి జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో యశ్వంత్‌సిన్హా మాట్లాడుతూ.. తమ పోరాటం రాష్ట్రపతి ఎన్నికతోనే ఆగదని, తరువాత కూడా కొనసాగుతుందని స్పష్టంచేశారు.
రాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ అని అభివర్ణించారు. తమ పోరాటం భారత భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మూలాలను రక్షించడం కోసమని స్పష్టంచేశారు. కేసీఆర్‌తో మరోసారి సమావేశమవుతానని తెలిపారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సీఎం కేసీఆర్ సవివరంగా చెప్పారని, ఆయన మాట్లాడిన ప్రతి మాటా వాస్తవమని చెప్పారు. దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చాలాకాలంగా పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు.
ఒక వ్యక్తి చెప్తుంటే 135 కోట్ల మంది వినాలా?
ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదని, మీడియా ముందుకు వచ్చేందుకు ఆయన ధైర్యం చేయలేరని యశ్వంత్‌సిన్హా ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సంధించిన ఏ ప్రశ్నకూ మోదీ సమాధానం ఇవ్వలేరని, ఆయన వద్ద సమాధానం లేదని పేర్కొన్నారు. ఒక వ్యక్తి (మోదీ) చెప్తుంటే 135 కోట్ల మంది ప్రజలు వినాలా? అని ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి ఏమాత్రం మేలు చేయవని హితవు పలికారు. తమది విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమని పేర్కొన్నారు. కేసీఆర్ ఒకరే తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడి తన స్వప్నం నెరవేర్చుకొన్నారని చెప్పారు. సాధించుకొన్న తెలంగాణను కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారని కొనియాడారు. దృఢమైన సంకల్పంతో వెళ్తే విజయం తధ్యమని నమ్ముతానని అన్నారు.
దేశంలో టీఆర్ఎస్, తెలంగాణ ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉన్నదని చెప్పారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని అన్నారు. తెలంగాణలో తనకు మద్దతుగా ఓట్లు వస్తాయని భావించాను కానీ ఇంతటి ఘన స్వాగతం పలుకుతారని ఉహించలేదని సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించి, తనను ఇంతగా గౌరవించిన కేసీఆర్‌తో పాటు, టీఆర్ఎస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వచ్చి తనకు మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. కేటీఆర్ వంటి యువ నేతలు అవసరమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఢిల్లీ రావడంతో తనకు మరింత బలం చేకూరిందని చెప్పారు.