హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని, రాజకీయాల్లోనూ ఆయన ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, ఎన్టీఆర్ కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, మోహనకృష్ణ, రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్లో నాణెం ముద్రణ…
ఎన్టీఆర్ స్మారక నాణెం హైదరాబాద్ మింట్లో తయారు కాగా, తొలిసారి వ్యక్తి చిత్రంతో నాణెం ముద్రించినట్టు మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. నాణెం ధర రూ.3,500 నుంచి 4,850 వరకు ఉంటుందని, తొలి విడత 12 వేల నాణేలు ముద్రించామని చెప్పారు.