హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తేతెలంగాణ): ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని కోరారు.
గురువారం హైదరాబాద్‌లోని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేసి 11,062 పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని గుర్తించిన అధికారులు పునఃపరిశీలన చేస్తున్నట్టు పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటాలో కూడా టీచర్ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరు బోగస్ అభ్యర్థులు ఉన్నట్టు ఫిర్యాదులు అందాయని అన్నారు. దీంతో అధికారులు స్పోర్ట్స్ కోటాకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మళ్లీ షెడ్యూల్ జారీ చేశారని తెలిపారు. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం కొన్ని సబ్జెక్టుల ఫలితాలను విడుదల చేసి మరికొన్నింటి ఫలితాలు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని వాపోయారు. రాత పరీక్షలు జరిగి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి పెండింగ్‌లో ఉన్న గ్రూప్ -4, జేఎల్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. సమావేశంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బషీరుద్దీన్, తిరుపతి, జావేద్, తిరుపతినాయక్, కార్తీక్, కృష్ణనాయక్, నవీన్, గడ్డం వెంకటేశ్, శివవర్మ, హరికృష్ణ, మహేశ్, జగన్, తదితరులు పాల్గొన్నారు.