హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): వందేండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) దేశానికి గర్వకారణమని, ఇక్కడ చదువుకున్న ఎందరో అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. ప్రపంచానికి నాయకులను అందించిన ఘనతను హెచ్పీఎస్ సొంతం చేసుకున్నదని ప్రశంసించారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతోపాటు ఎంతోమంది ఇక్కడ చదువుకొని ఉన్న త శిఖరాలకు చేరుకున్నారని చెప్పారు. విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, జాతి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జాతీయ నూతన విధానానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే మనోైస్థెర్యాన్ని అలవరుచుకోవాలని కోరారు. చారిత్రక నేప థ్యం ఉన్న ఇలాంటి పాఠశాలల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉన్నదని తెలిపారు.
పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం గవర్నర్ తమిళిసైసౌందర రాజన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా, బ్యాంకింగ్ రంగంలో, విద్యా, పారిశ్రామిక రంగాలతోపాటు, అడ్వకేట్లు, సీఏలను తీర్చిదిద్దిన ఘనత ఈ పాఠశాలకు ఉన్నదని పేర్కొన్నారు. ఇక్కడ చదివి సమాజంలో ఉన్నతస్థానంలో నిలిచిన ఎంతోమంది ముందు తాను నిలబడడం గర్వం ఉన్నదని తెలిపారు.
విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా జాతీయ నూతన విద్యా విధానం సాయపడుతుందని వివరించారు. విద్యా సంస్థలకు ఆటలు, చదువులు రెండు కన్నుల లాంటివని, ఇక్కడ విద్యార్థులను అన్ని రంగాల్లో భాగస్వామ్యయ్యేలా ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్రపతికి విద్యార్థులు శాస్త్రీయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ నోరియా, హెచ్పీఎస్ బోర్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
24 నుంచి వేడుకలు
వందేండ్ల వారసత్వ వేడుకల్లో భాగంగా ఈ నెల 24 నుంచి 27 వరకు ప్రత్యేక కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్నది. 25న సెంటినరీ గోల్ఫ్ టోర్నమెంట్, వింటేజ్, సూపర్ కార్ల ప్రదర్శన, ఆంత్రప్రెన్యూర్షిప్ సమ్మిట్, యూత్ పార్లమెంట్, లైవ్ కన్సర్ట్, వందేండ్ల పాఠశాల మధుర జ్ఞాపకాలను మరో 25ఏండ్ల తర్వాత అందించేలా టైం క్యాప్సూల్, ఫోటో ఎగ్జిబిషన్, అలూమినీ, స్టాఫ్ గ్రాండ్ యూనియన్, ప్రముఖ సింగర్లు శంకర్ ఏశాన్లాయ్తో గ్రాండ్ ఫినాలే మ్యూజిక్ షోతో విద్యారంగంలో వందేండ్ల చరిత్ర స్మృతులను భావితరాలకు అందించేలా నిర్వహించనున్నారు.