హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి సీతక్క పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్రపతి అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి అనంతరం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకొని బసచేశారు. శుక్రవారం ఉదయం శిల్పారామంలో నిర్వహించనున్న ‘లోక్ మంథన్-24’లో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.