హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఆ చిన్నారికి పుట్టుకతోనే అన్నవాహిక లేదు.. నోటి ద్వారా పాలు తీసుకోలేడు.. ఓ పైప్ అమర్చి కడుపులోకి పాలు పంపించారు.. అన్నవాహిక ఉంటే తప్ప పాలు తాగలేని పరిస్థితి. ఈ తరుణంలో నిమ్స్ వైద్యులు పెద్ద పేగుతో అన్నవాహిక తయారుచేసి చిన్నారికి పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకెళితే.. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కాసీరావ్, ఆది లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. కాసీరావ్ మత్స్యకారుడు.
చిన్న కుమారుడు కోదండరామ్‌కు పుట్టుకతోనే అన్నవాహిక లేదు. మూత్రపిండం కూడా చిన్నగా ఉండి పనిచేయటం లేదు. ఒకే కిడ్నీతో జీవిస్తున్నాడు. అన్నవాహిక లేకపోవటంతో బాలుడికి కడుపులో పైప్ అమర్చి ఏడాదిన్నరగా ద్రవపదార్థాలు అందిస్తున్నారు. అయితే, గత నెలలో ఇదే తరహా సమస్యతో ఎల్బీనగర్కు చెందిన మూడేండ్ల చిన్నారి నిశ్వితకు నిమ్స్‌లో శస్త్రచికిత్స చేశారు.
సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ బీరప్ప ‘కొలనిక్ ఇంటర్ పొజిషన్’ శస్త్రచికిత్స నిర్వహించి, అన్నవాహికను పునర్నిర్మించారు. ఈ శస్త్రచికిత్సపై గత నెల 14న ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది చూసిన ఓ వైద్యుడు కాసీరావ్ దంపతులకు చెప్పి, నిమ్స్‌కు వెళ్లాలని సూచించారు.
పొరుగు రాష్ట్రమైనా మమ్మల్ని నిమ్స్ డాక్టర్లు అక్కున చేర్చుకొన్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. మా బిడ్డకు కొత్త జీవితం ఇచ్చిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటాం. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన వార్తతో మేం ఇక్కడి వైద్యులను కలిశాం. మాలాంటి పేదవారికి కొత్త జీవితాలు ఇస్తున్న నిమ్స్ సేవలను అందరికీ వివరిస్తాం.
– కాసీరావ్ దంపతులు