హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నప్రసాదం, వసతి, దర్శనం, లడ్డూ నిల్వలు, ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, కళాబృందాలు, ఉద్యానశాఖ, రవాణా, కల్యాణకట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 8న శ్రీవారి గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
వృద్ధుల దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. మూడు నెలల ముందే ప్రతి నెలా 23న ఆన్లైన్ కోటా విడుదల చేస్తున్నామని పేర్కొంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని వెల్లడించింది. భక్తులు టీటీడీ వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ఇంద్రకీలాద్రిపై గత నెల 6న ప్రారంభమైన ఆషాడ సారె కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. తొలిరోజు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వైదిక కమిటీ, అర్చకులు కుటుంబ సమేతంగా అమ్మవారికి ఆషాడ సారె సమర్పించగా, చివరి రోజు ఆలయ ఈవో రామారావు, సిబ్బంది, పండితులు కుటుంబ సమేతంగా సారె సమర్పించారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.