హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ)/చండీగఢ్: బాయికాడ మోటర్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించి, రైతుల నుంచి ముందుగానే విద్యుత్తు బిల్లులు వసూలు చేసే కుట్రలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేస్తున్నది. కేంద్రం చెప్తున్నట్టుగా మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని, విద్యుత్తు సంస్కరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, కేంద్రం అలాంటి నిబంధనలు పెట్టలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పకొంటూ వచ్చారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 27 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఫొటోలతో సహా వెలుగులోకి తీసుకొచ్చింది. వాటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పెట్టించారని, కేంద్రానికి సంబంధం లేదన్న వాదనను బీజేపీ నేతలు వినిపించారు. ఇప్పుడు తాజాగా పంజాబ్‌లోనూ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం హుకూం జారీచేసింది. విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా పంజాబ్‌లో ఈ ఏడాది 85 వేల కనెక్షన్లకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని మోదీ ప్రభుత్వం నిర్దేశించింది. లేదంటే రాష్ర్టానికి రావాల్సిన విద్యుత్తు సంస్కరణల నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఉద్యమబాట పట్టారు.
భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. సోమవారం బటిండా జిల్లా పూహ్లీ గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ చేపట్టిన ఈ ఆందోళనకు క్రాంతికారి కిసాన్ యూనియన్ కూడా మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత డాక్టర్ దర్శన్పాల్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో 15 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వీటిన్నింటికీ మీటర్లు పెట్టించేందుకు, ముందస్తుగానే కరెంటు బిల్లులు వసూలు చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని చెప్పారు. సామాన్య రైతుల నడ్డివిరిచే ఇలాంటి కుట్రలను సాగనీయబోమని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినట్టే విద్యుత్తు మీటర్లకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.
కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రీపెయిడ్ మీటర్లను పెట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయ కనెక్షన్లకు ప్రీ పెయిడ్ మీటర్లు పెడితే సామాన్య రైతులు ముందస్తుగా డబ్బులు చెల్లించలేరని, వారికి కష్టాలు తప్పవని చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం కూడా విద్యుత్తు మీటర్లపై తన నిర్ణయాన్ని వెంటనే కేంద్రానికి స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.
నిన్న ఏపీలో.. నేడు పంజాబ్‌లో
కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 27 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు స్టార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం అక్కడ ఒక్కొక్క మీటర్ వద్ద దాదాపు రూ.1,500 చొప్పున బిల్లు నమోదవుతున్నది. ప్రస్తుతానికి అక్కడ వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్తు చార్జీలు వసూలు చేయకపోయినా భవిష్యత్తులో బాదుడు తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. బీజేపీ తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్తు చట్టాల ప్రకారం ప్రతి బాయికాడ విద్యుత్తు మీటర్లు పెట్టాల్సి ఉంటుంది. నెలనెలా రీడింగ్ తీసి, రైతుల ముక్కుపిండి బిల్లులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇది రైతులకు మోయలేని భారం కానున్నది. విద్యుత్తు సంస్కరణలు అమలుచేసే రాష్ర్టాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం పెంచుతామని కేంద్రం ఆశ పెడుతున్నది. దీనిని ఐదేండ్ల పాటు కొనసాగిస్తామని చెప్తున్నది. దీంతో ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.25 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని ఊరిస్తున్నది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రైతుల మీద భారం మోపేది లేదని, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్తున్నారు. పంజాబ్‌లో ఏకంగా రైతులే ఉద్యమిస్తున్న నేపథ్యంలో అక్కడి ఆప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌మాన్ కూడా పయనిస్తారా? అన్న చర్చ జరుగుతున్నది.
పంజాబ్‌లో 15 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటిన్నింటికీ మీటర్లు పె ట్టించేందుకు, ముందస్తుగానే కరెంటు బి ల్లులు వసూలు చేసేందుకు కేంద్రం కుట్ర లు పన్నుతున్నది. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం ప్రీపెయిడ్ మీ టర్లను పెట్టిస్తున్నది. సామాన్య రైతుల నడ్డివిరిచే ఇలాంటి కుట్రలను సాగనీయం.
– డాక్టర్ దర్శన్పాల్, క్రాంతికారి కిసాన్ యూనియన్ నాయకుడు