ములుగురూరల్, ఆగస్టు 3: డెంగ్యూ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన ములుగు మండలం జాకారం గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. జాకారం గ్రామానికి చెందిన మంచోజు రాజేంద్రప్రసాద్‌కు ఐదేండ్ల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అక్షితతో వివాహం జరిగింది.
వీరికి మొదటి కాన్పులో కూతురు జన్మించింది. ప్రస్తుతం రెండో కాన్పు కోసం ములుగు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నది. 9 నెలలు నిండిన అక్షిత (28) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజులపాటు ములుగులోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం పొందింది. అక్కడ తగ్గకపోవడంతో నర్సంపేటలోని మరో ప్రైవేట్ దవాఖానలో రెండు రోజులపాటు చికిత్స తీసుకున్నది.
నయం కాకపోవడంతో వరంగల్‌లోని మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగ్యూతోపాటు కామెర్లు వచ్చాయని, తల్లీబిడ్డకు ప్రమాదం ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని, శస్త్రచికిత్స చేసి శిశువును బయటికి తీశారు. అనంతరం అక్షిత మృతి చెందింది.