జోగులాంబ గద్వాల : రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు . మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా ఎస్పీ తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించారు.
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికిని , వాగులు, వంకలు ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా రోడ్డు మార్గాలను డైవర్ట్ చేయాలన్నారు. ఇందుకు గాను పోలీసు, గ్రామ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా శిథిలావస్థలో ఉన్న గృహాలు, పాఠశాలలను గుర్తించి అందులో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.
కొన్ని ప్రాంతాలలో వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈనెల 16, 17 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అధికారులు సెలవులో వెళ్లకుండా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
వర్షాల వల్ల నీరు కలుషితమై దోమలు ప్రబలి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రహీముద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి నాగేంద్రం, జిల్లా విద్యాధికారి సిద్ధప్ప, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, వివిధ శాఖల అధికారులు , తహసీల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.