హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన ఘటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తూ వస్తున్న ‘మరో ఏక్‌నాథ్‌షిండే’ కుట్రను తెలంగాణలోనూ బీజేపీ ప్రారంభించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాషాయ పార్టీ భారీ ప్రణాళికే వేసిందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను ట్రాప్ చేయటం ఈ కుట్రలో ప్రారంభం మాత్రమేనని అంటున్నారు. నిజానికి నలుగురు ఎమ్మెల్యేలను లాక్కోవటం వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. రాష్ట్రంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో బీజేపీ చేసేది కూడా ఏమీ లేదు. మరి నలుగురు ఎమ్మెల్యేలనే టార్గెట్ చేయటానికి కారణం ఏమిటన్నదానిపై రాజకీయ పండితులు పలు విశ్లేషణలు చేస్తున్నారు.
నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే టీఆర్ఎస్లో ఏదో జరుగుతున్నదన్న అనుమానాలను సృష్టించవచ్చని బీజేపీ భావించి ఉంటుందని అంటున్నారు. తద్వారా టీఆర్ఎస్లో చాలామంది ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఉన్నారని ఒక అబద్ధపు ప్రచారాన్ని బలంగా చేసి గందరగోళం సృష్టించాలన్న ఎత్తుగడ దీని వెనుక ఉన్నదని చెప్తున్నారు. ఈ గందరగోళంలో టీఆర్ఎస్ నేతలు కొందరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొనేలా చేసి పార్టీ నాయకత్వాన్ని ఎదిరించేలా చేయవచ్చని బీజేపీ నేతలు కుట్ర పన్నినట్టు కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోనూ సరిగ్గా ఇలాంటి ప్రచారమే చేసి శివసేనను నిలువునా చీల్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉద్ధవ్‌ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్‌షిండే వెంట తొలుత ఐదారుమంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ, పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారని బలంగా తప్పుడు ప్రచారం చేయటంద్వారా ఉద్ధవ్ వెంట ఉన్నవారిని కూడా షిండేవైపు మొగ్గేలా చేశారని పేర్కొంటున్నారు. తనను కిడ్నాప్‌చేసి గుజరాత్ తీసుకెళ్లారని ఓ ఎమ్మెల్యే స్వయంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కుట్ర అనుకొన్నట్టుగా సాగితే తెలంగాణలోనూ అదే ప్రణాళిక అమలుచేసేవారని అంటున్నారు.
తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని నిర్ణయించుకొన్న బీజేపీ, భారీగా డబ్బు వెదజల్లేందుకు సిద్ధమైందని సమాచారం. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెలను టార్గెట్ చేసి ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధపడిందని బయటపడింది. ఒక సాధారణ ఎమ్మెల్యేకే రూ.100 కోట్లు ఇస్తామని చెప్తున్నారంటే.. బీజేపీ తెలంగాణపై ఎలాంటి ఆపరేషన్‌కు సిద్ధమైందో తెలుస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. మరో ఏడాదిన్నరలో తెలంగాణకు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ రూ.10 వేల కోట్లను పార్టీ ఫండ్ కింద వసూలు చేసిందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.