యాదగిరిగుట్ట, జూన్ 19 : రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్‌కార్డులను మంజూరు చేయాలని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రధాన దేవాయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, కొమురవెళ్లి, బాసర దేవస్థాన ఉద్యోగ జేఏసీ ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.
888 జీవోలో ఉన్న దేవాలయాల పోస్టులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సవరణ చేయాలని సూచించారు. జీవో 261 సవరణ చేయడంతోపాటు, విరమణకు దగ్గరలో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న, చిన్న క్యాడర్ ఉద్యోగులను మాతృసంస్థలకు బదిలీ చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి ముజీబ్, టీజీవో జేఏసీ చైర్మన్ మందాడి ఉపేందర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.