హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఏడాది నుంచి తెలంగాణలో విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు మంత్రులు లేరని, విద్యార్థులు చస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాలపై రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, ఆరు నెలల నుంచి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదని, కేసీఆర్ హయాంలో ఆదర్శంగా నిలిచిన గురుకుల విద్యావ్యవస్థ నేడు కుప్పకూలిందని వాపోయారు. రాబోయే 50 ఏండ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలో ఒక స్పష్టమైన ఆలోచనతో, శిథిలమవుతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం కేటీఆర్ గురుకులాల బాట కార్యక్రమానికి పిలుపునిచ్చారని చెప్పారు. తెలంగాణభవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్యే బాల సుమన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తుంగ బాలు, రంగినేని అభిలాశ్, గదరాజు చందర్, రవీందర్‌రెడ్డి, పరశురామ్, విజయ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ గురించి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కనీస అవగాహన లేదని మండిపడ్డారు.
‘మీకు చేతకాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి’ అని హితవుపలికారు. విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్‌రెడ్డి, గురుకులాల పట్ల అవగాహన లేని కొందరు మంత్రులతో రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. రోజూ బీర్లు, బిర్యానీల గురించి వీడియోలు చేసే కొండా సురేఖకు, ఆకలితో అలమటిస్తూ, విషాహారం తిని దవాఖానల పాలవుతున్న పేద విద్యార్థుల బాధలు అర్థమవుతాయా? అని ప్రశ్నించారు. ‘దమ్ముంటే మీరు (సీఎం రేవంత్‌రెడ్డి) గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతేకాని భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి’ అని సవాల్‌చేశారు. ‘మానవత్వం అంటే ఏమిటో తెలియని మీకు (సురేఖ).. బీర్లు, బిర్యానీలు మాత్రమే తెలిసిన మీకు.. నా గురించి గాని, గురుకుల పేద విద్యార్థుల గురించి గాని మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు’ అని నిప్పులు చెరిగారు. మంత్రి సురేఖ భర్త కొండా మురళి వరంగల్‌లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థినుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ల జీవితాలు నాశనం చేశాడని ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లోని గెస్ట్‌హౌసుల గోడలే కొండా మురళి దారుణాలకు మౌనసాక్షిగా ఉన్నాయని విమర్శించారు. అతడి అరాచకాలు భరించలేక 2002లో నాటి జిల్లా ఎస్పీ నళిన్‌ప్రభాత్ హన్మకొండ చౌరస్తాలో మురళికి బహిరంగంగా కౌన్సెలింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. దానికి సాక్ష్యం అప్పుడు సీఐగా ఉన్న ప్రస్తుత వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి పిల్లలు చనిపోవాలా? : బాల్క సుమన్
రేవంత్‌రెడ్డి నయా దేశ్‌ముఖ్‌గా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి విద్యాశాఖను, సంక్షేమ శాఖను తన వద్ద పెట్టుకొని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలు, శక్తులతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కై.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు ఎకువగా చదువుకుంటున్న గురుకులాలను నీరు గారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని, 49 మంది చనిపోయారని, వీరిలో 23 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలను చంపుతారా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి శిఖండి రాజకీయాలు చేస్తూ.. మంత్రులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు. హాస్టళ్లు, గురుకులాలు మంచిగా ఉంటే తామెందుకు గురుకుల బాట చేపడతామని ప్రశ్నించారు.
డిసెంబర్ 7 వరకు గురుకుల బాట
శనివారం నుంచి డిసెంబర్ 7 వరకు బీఆర్ఎస్వీ గురుకులాల బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 33 బృందాలు 33 జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలను సందర్శిస్తాయని తెలిపారు. సమస్యలపై నివేదికను కేటీఆర్‌కు అందజేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ లేవనెత్తుతుందని చెప్పా రు. బీఆర్ఎస్పై కోపాన్ని విద్యార్థులపై చూపిస్తున్నారని, ఫుడ్ పాయిజన్‌తో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను మంత్రులు ఎందుకు పరామర్శించడం లేదని నిలదీశారు. ఫుడ్‌సేఫ్టీ విభాగంలో విద్యార్థులు ఉండేలా చూడాలని సూచించారు.
గురుకుల సమస్యలపై హెల్ప్‌లైన్ 8522044336
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఎలాంటి సమస్యలున్నా బీఆర్ఎస్వీ హెల్ప్‌లైన్ నంబర్ 8522044336కు వాట్సాప్ మెసేజ్ చేయాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విజ్ఞప్తిచేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన ఫొటోలు, మెస్సేజ్‌లను ఈ నంబర్‌కు పంపాలని సూచించారు. అనంతరం ‘గురుకుల బాట’కు బయలుదేరిన బీఆర్ఎస్వీ నాయకుల వాహనాలను తెలంగాణభవన్‌లో జెండాఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేను ప్రభుత్వ హాస్టల్స్‌లో చదువుకొని ఐపీఎస్ అయిన. దేశ రక్షణ కోసం పనిచేసిన. అనేక అవార్డులు అందుకున్న. ఏడేండ్ల సర్వీసును వదిలి రాజకీయాల్లోకి వచ్చిన. తొమ్మిదేండ్లు గురుకులాల కార్యదర్శిగా ఉన్న. నా రికార్డులు సంక్షేమభవన్‌లో భద్రంగా ఉన్నయి. అధికారం మీ చేతుల్లో ఉంది. ఏసీబీ మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. తప్పు చేశానని తేలితే జైలుకు వెళ్లేందుకైనా,ఉరికంభం ఎక్కేందుకైనా రెడీ.
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్