హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 4: ఎమ్మెల్యేగా, మంత్రిగా బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఎంతోమందిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, భాషబోయిన ప్రవీణ్‌యాదవ్ అలాంటి వేధింపుల వల్లే మృతి చెందాడని రిటైర్డ్ సీఐ, టీఆర్ఎస్ నాయకుడు దాసరి భూమయ్య స్పష్టంచేశారు. ఈటల రాజేందర్‌పై దళిత బాధితుల సంఘం రూపొందించి, పంపిణీ చేస్తున్న కరపత్రాలతో టీఆర్ఎస్ పార్టీకి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దవాఖానలో పనిచేసే జానీ అనే యువకుడిని అకారణంగా కేసులో ఇరికించి రౌడీషీట్, పీడీయాక్ట్ పెట్టించి వేధించింది వాస్తవం కదా? అని ప్రశ్నించారు. ఈటల ఆస్తులపై నిలదీసినందుకు మాజీ ఎన్ఎస్యూఐ నాయకుడు తిప్పారపు సంపత్‌పై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులను పురమాయించి, వేధించింది వాస్తవం కాదా? అని అడిగారు. కమలాపూర్‌లో మాజీ సర్పంచ్ సమ్మయ్యను శిలాఫలకం ధ్వంసం కేసులో పార్టీకి చెందిన సర్పంచ్ అయినప్పటికీ కాల్వశ్రీరాంపూర్ పోలీసులతో ఈటల కిడ్నాప్ చేయించి వేధింపులకు గురిచేసింది నిజం కాదా? అని భూమయ్య నిలదీశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రవీణ్‌యాదవ్‌ను విధుల్లో చేర్చుకోకుండా సూపరింటెండెంట్‌తో కలిసి తప్పుడు కేసు పెట్టించి, పోలీసులతో కొట్టించడంతో మనోవేదనకు గురై ప్రవీణ్ కన్నుమూయడానికి ఈటల కారణం కాదా? అని భూమయ్య ప్రశ్నించారు. ఇందులో ఏ ఒక్కటి వాస్తవం కాదన్నా, తాము చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.