హైదరాబాద్ జూలై 7 (నమస్తే తెలంగాణ): కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని తాము అడిగితే, కుంగిన బరాజ్‌కు ఎత్తిపోయాల్నా? అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘బరాజ్కూ, మోటర్లు నడపడానికి ఏం సంబంధం? ఎందుకు ఈ అవగాహనారాహిత్యం? అసలు కుంగింది మేడిగడ్డ కాదు.. ఉత్తమ్‌కుమార్ మెదడు’ అని సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ మినిమం డ్రా లెవల్ 93.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 96 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నందున ఎత్తిపోయాలని తాము డిమాండ్ చేస్తే ఉత్తమ్ మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించాలని కోరితే సాకులు చెప్తూ దిగువకు వదులుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 19 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టయినా నిర్మించారా? ఒక్క చెక్‌డ్యాం కట్టారా? ఒక్క చెరువులోనైనా పూడికతీశారా? ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో నిర్మించిన కాళేశ్వరంతోనే రిజర్వాయర్లు నిండాయని, చెక్‌డ్యాంలు, చెరువులు మత్తళ్లు దుంకాయని తెలిపారు. మే 30న శ్రీశైలానికి వరద వచ్చి, నీళ్లు కిందికి వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కల్వకుర్తి మోటర్లు నడపకపోవడం చేతగానితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం తగ్గితే కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.