ఖలీల్‌వాడి, జూన్ 3 : రాజధాని, సెక్రటేరియట్‌ను కూడా కట్టుకోలేని వారు తెలంగాణకు వచ్చి పునర్నిర్మిస్తారా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన, నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక చంద్రబాబు, మోదీ ఉన్నారని, రేవంత్‌రెడ్డిని ఏజెంట్‌గా వాడుకుంటూ తెలంగాణపై దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల నుంచి కాపాడుకోవడానికి కేసీఆరే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ కబ్జాలు చేయడమే కాంగ్రెస్ నాయకుల పనిగా మారిందని మండిపడ్డారు. నాదర్గుల్, వట్టినాగులపల్లి భూముల్లో వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని, మంచిరేవులలో వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన 116 ఎకరాల దేవాదాయ భూములను మింగేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారని ఆరోపించారు.
రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అందకుండా చేసి వ్యవసాయ రంగాన్ని నిలువునా ముంచేందుకే రైతు డిస్కమ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చినట్టు వేముల విమర్శించారు. విద్యుత్ డిస్కమ్‌ను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని ఆరోపించారు. ఫ్యాక్టరీలు, కమర్షియల్, గృహావసరాలకు సంబంధించి ఆదాయం వచ్చే డిస్కమ్‌లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వేల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకం వేసినట్టు తెలిపారు. గతంలో కమర్షియల్, ఇండస్ట్రియల్ విభాగాల నుంచి వచ్చే ఆదాయంలో నుంచి ఏటా రూ.10 వేల కోట్ల ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం వాడేవారమని తెలిపారు. ఇప్పుడు లాభాలు వచ్చేవి ప్రైవేట్‌కు ఇచ్చి కరెంట్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న రూ.35 వేల కోట్ల బాకీని రైతు డిస్కమ్‌పై నెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, అర్బన్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి రవీందర్‌సింగ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.