హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ప్రధాని మోదీపై తోసి సీఎం రేవంత్‌రెడ్డి కాడి ఎత్తేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాహుల్‌ని ప్రధానిని చేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్న రేవంత్‌రెడ్డి.. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆపుతారా? ఆయన ప్రధాని అయ్యేది ఎప్పు డు? బీసీ డిక్లరేషన్ అమలయ్యేది ఎప్పుడని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌వి ఉత్త మాటలేనని, కాంగ్రెస్‌కు బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమైందని పేర్కొన్నారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి ధర్నాకు కూతవేటు దూరంలో ఉన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఉన్న ప్రేమ ఇదేనా? అని ఎద్దేవా చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రేవంత్, కాంగ్రెస్ అటకెకించాయని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్ అనే జైల్లో బందీ అయ్యాడని రేవంత్ అంటున్నారని, కానీ, రేవంత్‌రెడ్డియే ఒకప్పటి జైలు పక్షి అని.. ఆయన తన చరిత్రను తిరగేసి చూసుకోవాలని చురకులు అంటించారు.