హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబర్లో ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు బిల్లులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సర్పంచుల్లో 80శాతానికి పైగా బీఆర్ఎస్వారే ఉన్నందున సర్కారు కక్ష సాధింపునకు దిగుతున్నదని విమర్శించారు. మరణించిన సర్పంచులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్వంత్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు బల్వంత్‌రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ శ్రీనునాయక్ పాల్గొన్నారు.
బిల్లులు విడుదల చేయాలి: జేఏసీ
సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వచ్చే నెల 31లోగా బిల్లులు విడుదల చేయకుంటే రాష్ట్రంలోని 12,769 పంచాయతీల్లో భార్యాపిల్లలతో కలిసి ఆందోళనకు దిగుతామని యాదయ్యగౌడ్ హెచ్చరించారు.