రామగిరి, మార్చి 10 : దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, ఐదున్నర సంవత్సరాలపాటు వాదోపవాదాలు విన్న కోర్టు ఏ2 సుభాశ్శర్మకు ఉరి శిక్ష విధించగా, మిగతా ఆరుగురు దోషులకు జీవిత ఖైదు విధించింది. రెండో అదనపు సెషన్ కోర్టు న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి రోజారమణి ఈ సంచలన తీర్పు వెలువరించారు. ఈ తీర్పును ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి స్వాగతించారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తిరునగరి మారుతీరావు కుమార్తె అమృత, అదే పట్టణానికి చెందిన పెరుమళ్ల బాలస్వామి కుమారుడు ప్రణయ్(ఎస్సీ) 2018 జనవరి 30న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ కులాంతర వివాహాన్ని అంగీకరించని మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను అదే ఏడాది సెప్టెంబర్ 14న హత్య చేయించారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మారుతీరావు సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అప్పటి నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ 1,600 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎనిమిది మందిపై 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి తిరునగరి మారుతీరావు(ఏ-1) కేసు విచారణ సాగుతున్న సమయంలో 2020 మార్చి 7న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఏ-2 సుభాష్‌శర్మ, ఏ-3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు 2019లో బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.
ఐదున్నర సంవత్సరాలపాటు ఇరువైపుల వాదోపవాదాలు విన్న కోర్టు సాక్షులను విచారించి వివరాలు నమోదు చేసింది. తాజాగా సోమవారం తుది తీర్పు వెలువరించింది. మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, మిగిలినవారిలో బీహార్‌కు చెందిన సుభాశ్‌కుమార్ శర్మ (ఏ-2)కు ఉరి శిక్షతోపాటు రూ.15 వేలు జరిమానా, నల్లగొండకు చెందిన మహ్మద్ అస్గర్ అలీ(ఏ-3), మహమ్మద్ అబ్దుల్ బారీ(ఏ-4), మిర్యాలగూడకు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీం(ఏ-5), మారుతీరావు సోదరుడు తిరునగరి శ్రవణ్‌కుమార్(ఏ-6), మారుతీరావు డ్రైవర్ సముద్రాల శివ(ఏ-7), నల్లగొండకు చెందిన ఆటోడ్రైవర్ ఎంఏ నజీమ్(ఏ-8)కు జీవిత ఖైదీతోపాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. కేసు దర్యాప్తులో సరైన ఆధారాలను సేకరించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చేసిన అప్పటి విచారణాధికారి, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్, ప్రస్తుత డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ సైదిరెడ్డి, సిబ్బంది వీరస్వామి, మధుసూదన్, నరేందర్, మల్లికార్జున్, కేసులో ప్రత్యేక న్యాయవాదిగా ఉన్న దర్శనం నర్సింహను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.
తీర్పు అనంతరం మారుతీరావు సోదరుడు శ్రవణ్‌కుమార్(ఏ-6) భార్య, కుతూరు నల్లగొండ కోర్టులో బోరుమన్నారు. పోలీసులు తన తండ్రిని అన్యాయంగా కేసులో ఇరికించారని, బెదిరించి బ్లాంక్ పేపర్ల మీద సంతకం చేయించుకున్నారని, నిర్దోషిగా విడుదల చేయాలని, లేనిపక్షంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కూతురు స్ఫూర్తి విలపించారు.
నిజం గెలిచింది.. కష్టానికి ఫలితం దక్కిందని ప్రణయ్ హత్య కేసును వాదించిన లాయర్, నల్లగొండ స్పెషల్ పీపీ దర్శనం నర్సింహ తెలిపారు. కోర్టు తీర్పు హర్షణీయమని, ఈ తీర్పు కుల దురహంకారులకు తీవ్ర హెచ్చరిక అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 10 ( నమస్తే తెలంగాణ ): కుల దురహంకార హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ సోమవారం నల్లగొండ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఈ తీర్పు కుల దురహంకారులకు తీవ్ర హెచ్చరిక అని పేర్కొన్నారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్, అమృత కులాంతర వివాహం చేసుకోగా, కుల దురహంకారంతో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను నడిరోడ్డు మీద కిరాతకంగా హత్య చేయించారని చెప్పారు. ఈ హత్యకు వ్యతిరేకంగా, అమృతకు అండగా సీపీఎం నిలబడిందని, దోషులను కఠినంగా శిక్షించాలని పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరిగాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో నేటికీ ఇలాంటి హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తీర్పువల్లనైనా కుల దురహంకారులకు కనువిప్పు కలగాలని ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రణయ్‌ను అతి దారుణంగా చంపిన నిందితులకు కోర్టు సరైన శిక్ష విధించిందని పెరుమాళ్ల బాలస్వామి తెలిపారు. ప్రణయ్ హత్య తర్వాత కూడా రాష్ట్రంలో చాలా పరువు హత్యలు జరిగాయని, అలాంటి వారందరికీ కోర్టు ఇచ్చిన తీర్పుతో కనువిప్పు కలగాలని తెలిపారు. అంతకుముందు కుటుంబసభ్యులు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ప్రణయ్‌ను తలుచుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.